Friday, July 18, 2008

చిన్న సందేశాలు

నా జేబులోని బుల్లి బూచాడికి వచ్చిన సందే శాలు కొన్ని.తెలుగు లో తర్జుమా చేసి.

మొదటిది:
చిరంజీవి గారు రజినికాంత్ ని ఇలా అడుగుతున్నారు.
చిరు:నా శంకర్ దాదా జిందాబాద్ సినిమాలొ రవితేజా వున్నాడు,పవన్ కళ్యాణ్ వున్నాడు,అల్లు అర్జునున్నాడు,నాగబాబున్నాడు,ప్రభుదేవా వున్నాడు అయినా సినిమా హిట్ అవలేదు.శివాజిలో నువ్వొక్కడవే అయినా హిట్ అయ్యింది ఎలా బాసు.
రజిని:నాన్నా పందులే గుంపుగా వస్తాయ్.సిమ్హం సింగిల్ గా వస్తుంది.
(ఎవ్వర్ని నొప్పించడానికి కాదు)


రెండవది:
సంతోషం కరమైన సంధర్బాలలొ నన్ను మర్చి పోవద్దు.కష్టపరిస్థితుల్లో నన్ను నమ్ము.ఏమి తోచని సమయంలో నాకు కాల్ చెయ్యి.ఖాళిగా వున్నపుడు నాకు ఎస్సెమ్మేస్ చెయ్యి.

ఈలోకంలో కొన్ని జంటలు అద్బుతంగా వుంటాయి.ఉదా:-గుండె మరియు గుండె చప్పుడు,చంద్రుడు మరియు రాత్రి,గులాబి మరియు ప్రేమ,పక్షులు మరియు పాటలు,నా ఎస్సెమ్మెస్ నీ నవ్వు.

ఇవి మచ్చుకు.

Friday, March 28, 2008

కాంక్రీట్ వాసనకి మట్టి వాసన మూలాలు కొల్పోయింది

పుల్లలపొయ్యిమీద కొత్తకుండలొ కొత్త బియ్యంతో కాసే పరమాన్నం(క్షీరాన్నం)అరిసెలు,జంతికలు,సున్నివుండలు అన్నీ తయారయ్యేది మాచుట్టిల్లు చూరుకిందే.ఒకసారి ఎన్నికల సమయంలో మర్చిపోలేని సంఘటనొకటి జరిగింది.

మా నాన్నగారు తెలుగుదేశం అభిమాని ఎన్నికలొచ్చాయంటే ప్రచారపు హడావిడిలో తిరుగుతుండేవారు.ఒకసారి మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి మా బాప్ప(మేనత్త)కి ఒంట్లోబాగాలేదంటే చూసొద్దామని ఊరు వెళ్ళారు.ఇహ ఇంట్లో వున్నది నేను మా చెల్లి మా అమ్మమ్మ.ఇద్దరూ ఆడాళ్ళె వున్న ఏకైక మగదిక్కు మనమే దాంతో రాజ్యమ్మొత్తం మనదే.ఇద్దర్నీ అసలు నోరెత్తనిచ్చే వాళ్ళంకాదు.ఎన్నికల ప్రచారం అప్పుడప్పుడే ఊపందుకుంటున్నాయ్.ఒకరోజు కాంగ్రేస్ తరుపువాళ్ళోచ్చి మా గోడమీద హస్తం గుర్తు వేస్తామని నన్నడిగారు ఈలోపు మా అమ్మమ్మ వద్దంది.మనకి నషాళానికెక్కిపోయింది ఇంత పెద్దమగాన్నిక్కడుంటే వద్దంటానికి నువ్వెవరు నేవేయిస్తా ఫో...అని దగ్గరుండి మరీ వెయించా.వెయించనైతే వేయించానుగాని ఒక ప్రక్క గుండే రైలింజన్లా కొట్టుకుంటూనేవుంది.ఏదో మా మామ్మని డామినేట్ చెద్దామని వేయించానేగాని స్వతహాగా నాకు ఇష్టం లేదు.మా నాన్నొచ్చాకేమంటారోనని నిద్రకూడా సరిగ్గాపట్టలేదు.ఇహ లాభం లేదనుకుని మా నాన్నొచ్చే సమయానికి అడ్రస్ లేకుండా పరార్. సాయంత్రం ఏడుగంటలదాకి ఇల్లుచేరాం.మా అమ్మ ఒకటే తిట్లు పొద్దుట్నుంచి ఎక్కడికెళ్ళిపోయా వంటూ.హమ్మయ్య అయితే నాన్నేమీ అనలేదన్నమాట ఛా..అనవసరంగా ప్రొద్దుట్నుంచి అన్నం తినకుండా తిరిగేసానన్నమాట .తరువాతెప్పుడో మా చెల్లిచెప్పింది మా నాన్న రాగానే మా మామ్మ నా మీద పితురీ చెప్పిందటగాని వాడిల్లు వాడిష్టం అనేసి వెళ్ళిపోయారని.వెంటనే మా మామ్మ దగ్గరకెళ్ళి మీసమ్మేలేసిన ఫొజొకటిచ్చుకున్నాం.ఇలా చాలా ఙాపకాలు ఆ చుట్టింటిచుట్టూ పెనవేసుకున్నాయి.


ఒక రోజు నాన్నొచ్చి ఇల్లుపడేసి కొత్తిల్లు కడదాం అని అమ్మతో చెబుతుంటే విన్నా.కొత్తిల్లు కట్టుకుంటున్నాం అనే ఆనందంలో మా చుట్టిల్లు నా కళ్ళముందే కూలిపోతున్నా ఆ చిన్నవయసులో జరిగే చెడేమిటనేదర్దంకాలేదు.ఈ రోజు అర్దమవుతున్నా తలచుకోవడానికేతప్ప చూసుకోవడానికి ఆనవాళ్ళేలేవు.ఆ మట్టి గోడల మధ్య వున్న చల్లదనం ఆ హాయి ఈ కాంక్రీటుగోడలకెలా వస్తుంది చెప్పండి.ఈ కాంక్రీటు వాసన మత్తులో ఆ మట్టి వాసన తన మూలాల్ని కొల్పోయింది.కాదు చేజేతులారా పొగొట్టుకుంటున్నాం.ఇప్పుడు నా మనసులో వున్న కొన్నిముఖ్యమైన ప్రణాళికలలో మా చుట్టిల్లుదే ప్రధమస్థానం.ఎప్పటికైనా మా చుట్టింటిని తిరిగి కట్టుకుంటాను ఎన్నేళ్ళ తరువాతయినా శేషజీవితం అంతా దాంట్లోనే.దానికి చాలాసమయం వుందిగాని నా నిర్ణయం మాత్రం మారనిది.

Thursday, March 27, 2008

మా చుట్టిల్లు

ఇదేంటి విచిత్రంగా వుందనుకుంటున్నారా అది మా పాత ఇల్లు.గుండ్రంగా కోట బురుజుని తలపిస్తూ మట్టిగోడలతో జమ్ము గడ్డితో నేసిన పైకప్పుతో ఠీవీగా నిలబడి వుండేది.అసలు నా బాల్యమంత దాని చుట్టూ అల్లుకుని వుంది.ఇంటి ఙాపకాలు ఇంతింతగాదయ అన్నన్ని బోలుడు తీపిగుర్తులు.

బడి నుంచి ఇంటికి వచ్చేప్పటికి మా అమ్మ గుమ్మమ్ముందు మిషన్ కుడుతూ వుండేది.పుస్తకాల సంచి ఇంట్లో పడేసి పరిగెత్తుకుని అమ్మ దగ్గరకెళ్ళి గోలగోల చేసేసి పది పైసలు నొక్కేసి రోడ్డుమీద పడిపోయే వాణ్ణి.పదిపైసలతో రెండు జీళ్ళు కొనుక్కుని ఒకటి నోట్లో వేసుకుని రెండోది నిక్కర్(నా పదో తరగతి అయ్యెదాక పేంట్లు తెలియదు నాకు) జేబులోవేసుకోని ఛలో రామాలయం అని ఆటలకెల్లిపోవడం.ఇలాగే సాగిపోయేది నా దినచర్య.అసలు మా ఇంటి గురించి చెప్పాలంటే సంక్రాంతికి ఒక నెల రోజులముందు మొదలు పెట్టాలి.సంక్రాంతి వస్తుందంటేనే ఒక పెద్దసందడిగా వుండేది.

మొత్తం ఇంట్లో సామాన్లన్ని బయటపెట్టేసి ఇల్లు పొక్కు తీయడం మొదలు పెట్టేవాళ్ళం.పొక్కు తీయడం ఏంటనుకుంటున్నారా.ఇంట్లో మట్టి నేలయినప్పుడు ఎప్పటికప్పుడు అలికినా నేల మాత్రం పెచ్చులు కింద రేగిపొతుంటుంది వాటినే పొక్కులంటారు. అలా రేగిన పొక్కుల్ని అట్లకాడతో గీకి అవన్ని బయటవేసి దానికి మరికొంత మట్టిని కలిపి ఒకరోజంతా నానపెట్టి దాన్ని కాళ్ళతోతొక్కి,వట్టి కాళ్ళతో మట్టిని తొక్కుతుంటే బలే సరదాగా వుండేదిలెండి. అదే మట్టితో మళ్ళి ఇల్లలికేది మా అమ్మ.దాంతో ఇల్లలికే ప్రహసనం ముగిసేది దానితరువాత ఇంటికి సుద్ద వెయ్యడం.సుద్దని నానపెట్టి దాన్ని ఇంట్లో గోడలకి ఒక పాత గుడ్డతో పూసేవాళ్ళం గోడలతో పాటు వంటిక్కూడా.ఆ సుద్దేసిన వారం రోజులదాక బలే గమ్మత్తయిన వాసన వచ్చేది.కొత్త వాన పడ్డప్పుడు వచ్చే మట్టివాసన ఈ సుద్ద వాసన అంత తొందరగా మర్చిపోయేవి కాదండి.అప్పుడుగాని మొదలయ్యేవికాదు పిండి వంటలు.పుల్లల పొయ్యి మీద అమ్మ అరిసెలు జంతికలు వండుతుంటే అటొచ్చొకటి ఇటొచ్చొకటి జేబులో పెట్టుకు పోవడం.ఇవన్ని ఒకెత్తయితే అరిసెలు వేయడం అయిపోయాక మిగిలిన అరిసెల పిండికి నీళ్ళుకలిపి మూకుట్లొ అట్టులాగ వేసె అప్పం ఒకెత్తు ఏమిరుచిలెండి.ఇహ బోగి వచ్చిందంటే మామూలుగా ఏడు ఎనిమిదింటిగ్గాని లెగని మనం ఉదయం నాలుగున్నరకే లేచి బోగిపిడకల దండపట్టుకుని బోగి మంటదగ్గరకి పరిగేట్టేవాణ్ణి అక్కడే స్నానం కనీసం నాలుగు బక్కెట్ల నీళ్ళతో.నీటిగురించి ఆలోచించడానికి ఒక్కో నీటి బొట్టు రూపాయికి కొనుక్కు తాగే సిటీ కాదుగామాది,గుండెను తొలచే కొలది ప్రేమతో చెలమలకొద్ది నీళ్ళిచ్చే పల్లెనేల మాది.అందుకే ఆ తల్లిచ్చేది మళ్ళి ఆ తల్లికే చేరాలని ఆరుబయట మట్టి నేలమీదే స్నానం చేయమనేవాళ్ళు పెద్దవాళ్ళు.ఒక ప్రక్క ఎముకలు కొరికే చలి మరో ప్రక్క బోగి మంటలో కాసినవేడి నీళ్ళు గొప్పసరదాలేండి.

ఇంకొన్ని తరువా ముచ్చటించు కుందామండి వుంటాను.